రామారావు ఆన్‌ డ్యూటీ మూవీ రివ్యూ

Published On: July 29, 2022   |   Posted By:

రామారావు ఆన్‌ డ్యూటీ మూవీ రివ్యూ

రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’రివ్యూ

Emotional Engagement Emoji (EEE)
👎

ఇప్పుడున్న పరిస్దితుల్లో జనాలని థియేటర్ కి రప్పించి, హిట్ అనిపించుకోవటం పెద్ద యజ్ఞమే. అయితే రవితేజ వంటి స్టార్ హీరోలకు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్,మార్కెట్ ఉండటంతో మినిమం ఓపినింగ్స్, టాక్ బాగుంటే హిట్ అనిపించుకోవచ్చనే థైర్యం ఉంది. ఆ క్రమంలోనే ‘రామారావు ఆన్‌ డ్యూటీ’పాజిటివ్ బజ్ తో థియేటర్స్ లో దిగింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందా…కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

నిజాయితీ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు డిప్యూటీ కలెక్టర్ రామారావు (రవితేజ) . దాంతో ఎక్కడా నిలకడగా ఉండడు. ఆ క్రమంలో ట్రాన్సఫరై సొంత ఊరు చిత్తూరు వస్తాడు. అక్కడ రామారావు ఆఫీస్ కి మాళిని (రజిషా విజయన్) అనే ఆమె వరసగా కంప్లైట్స్ రాస్తూంటుంది. ఆమె కంప్లైంట్ ఏమిటి అంటే మాళిని భర్త సురేంద్ర ఏడాదిగా కనిపించకుండాపోయాడు. పోలీసులు పట్టించుకోకపోవటంతో ఎమ్మార్వోలను, కలెక్టర్స్ ని సంప్రదిస్తోంది. ఈ కేసుని టేకప్ చేసిన రామారావుకు ఆమె మరెవరో కాదు తన చిననాటి ప్రియురాలు అని తెలుస్తుంది. దాంతో ఆమెను తీసుకుని సిఐ మురళి (వేణు) కి ఫిర్యాదు చేస్తారు. సిఐ మురళి ఆ కేసుని సీరియస్ గా తీసుకోడు. దాంతో రామారావు రంగంలో దిగి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఈ క్రమంలో తప్పిపోయింది మాళిని భర్త మాత్రమే కాదు, దాదాపు 22 మందని విషయం బయిటకు వస్తుంది. అంతేకాదు వాళ్ళు కనిపించకుండా పోవడానికి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు ముడి ఉందని డౌట్ వస్తుంది. కేసు దర్యాప్తు ముందుకు వెళ్లనీయకుండా చాలా మంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతెందుకు రామారావుని సొంత బాబాయ్ కొడుకు అనంత్ (రాహుల్ రామకృష్ణ) చంపాలని అనుకుంటాడు. అసలు ఇదంతా ఏమిటి… వీరంతా ఎలా మిస్సైపోయారు? ఈ మిస్సింగ్ లు వెనుక ఉన్నది ఎవరు…వారు ఎందుకిలా చేస్తున్నారు… రామారావు ఈ మిస్టరీని ఎలా చేధించాడు ? సొంత బాబాయ్ కొడుకు రామారావు మీద ఎందుకు అటాక్ చేశాడు? అనేది తెరపై తెలుసుకోవాల్సిన కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …

1995 చిత్తూరులో జరిగే ఈ కథ ఓ ఇన్విస్టిగేషన్ డ్రామా, సినిమా చివర్లో విలన్ ని రివీల్ చేసే ట్విస్టెడ్ థ్రిల్లర్. ఈ జోన‌ర్‌లో క‌థ‌లు చాలా వ‌చ్చాయి. కాక‌పోతే… ఎర్రచందనం ఈ కథలో కొత్తగా అనిపించే కీ అంశం. క‌థ‌ని కూడా ముప్పై యేళ్లు వెన‌క్కి తీసుకెళ్లారు. దాంతో ఈ క‌థ‌కు కొత్త లుక్ వ‌చ్చింది. సినిమా మొద‌లైన కాసేపటికి రవితేజ ఓ స్టైలీష్ ఫైట్‌తో.. ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డి నుంచి క‌థంతా రామారావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సాధార‌ణంగా ఇలాంటి ఇన్వెస్టిగేష‌న్ క‌థ‌ల్లో.. ముందు చాలా పాత్ర‌ల‌పై అనుమానాల్ని క‌లిగించేలా సీన్లు అల్లుతారు. అదే ఈ క‌థ‌లోనూ అదే జ‌రిగింది. అలాగే ఈ క‌థ‌లో కొన్ని సైడ్ ట్రాకులు కూడా క‌నిపిస్తుంటాయి. అయితే అవేమీ కథకు పనికిరాలేదు. అలాగే ఇలాంటి డ్రామాలు ఎప్పుడూ కూడా ఇంటెన్స్ గా వుండాలి. ఇందులో ఆ తీవ్రత తగ్గింది. ఈ కథ 95నాటిది. అయితే ఈ కాలం నాటి స్వభావలే పాత్రలలో కనిపిస్తాయి. థ్రిల్లర్ కథ చేసినప్పుడు మైండ్ గేమ్ చాలా ముఖ్యం. ఇందులో ఆలాంటి మైండ్ గేమ్ ఏమీ కనిపించదు. రవితేజ వంటి మాస్ హీరో పాత్రకు ప్రత్యేకమైన ఎలివేషన్ వుండదు. ఇది ఒక రకంగా కొత్తదనమే అనుకోవాలి. కానీ ఇబ్బందికరం. మిస్సైనవాళ్లు ఎవరనేది తేల్చే ప్రాసెస్ లో చేసే కొన్ని ప్రయత్నాలు ఆసక్తికరంగానూ మరి కొన్ని సాగాదీతగా అనిపిస్తాయి. ఇక సినిమా ఫస్టాఫ్ స్క్రీన్ టైమ్ మొత్తం కథను,క్యారక్టర్స్ ని సెటప్ చేయటానికే తీసుకున్నారు. అసలు పాయింట్ లోకి రావటానికి గంటపైన పట్టింది. సెకండాఫ్ అయినా సినిమా కథ లోకి వెళ్తుంది అనుకుంటే …ఇన్విస్టిగేషన్ డ్రామా తో నింపేసారు. అదీ బాగా బోరింగ్ గా, రొటీన్ గా సాగుతుంది. విలన్ ఎక్కడో చివర్లో కనిపిస్తారు. అక్కడిదాక హీరో పోరాడుతాడు కానీ అతనికో గమ్యం ఉండదు. విలన్ ఎవరో తెలియకుండా హీరో అలా ప్లాట్ గా ఒక్కో క్లూ పరిష్కరించుకుంటూ డిటెక్టెవ్ గా ముందుకు వెళ్తే ఆ కథకు రవితేజ ఎందుకు?

టెక్నికల్ గా…

డైరక్టర్,రైటర్ గా శరత్ మండవ ఇలాంటి కథకు రవితేజను ఎంచుకోవటమే తప్పు. కాబట్టి ఎంత ఎలా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరే. ఇక ఈ చిత్రం పాటలు ఎలా ఉన్నా నేప‌థ్య సంగీతం క‌థ మూడ్ కి త‌గ్గ‌టు సాగింది. కెమెరా వ‌ర్క్‌కూడా ఓకే అనిపిస్తుంది. బాగా ఖ‌ర్చు పెట్టాల్సి తీసిన సినిమా. క‌థ‌లో, క్యారెక్ట‌రైజేష‌న్‌లో బ‌ల‌మైన లోపం ఉంది. సబ్ కలెక్టర్ అయిన ప్ర‌ధాన పాత్ర‌ని ఇన్విస్టిగేషన్ చేసే డిటెక్టెల్ తీర్చిదిద్ద‌డం ఇవ‌న్నీ క‌థ‌ని బ‌ల‌హీనంగా మార్చేశాయి. చివ‌రికి బాగా కుద‌రాల్సిన స్క్రిప్టుని క‌ల‌గాపుల‌గం చేసేశాయి. ఎడిటింగ్ పరంగా చాలా ల్యాగ్ సీన్స్ తీసేయచ్చు అనిపించింది. డైలాగుల్లో చెప్పుకోదగ్గ వి లేవు.

నటీనటుల్లో

రవితేజ లాంటి న‌టుడు ఉండబ‌ట్టి 2 గంట‌ల 25 నిమిషాల ఈ ప్ర‌హ‌స‌నాన్ని కాస్త అయినా భ‌రించ‌గ‌లిగాం. క‌థ ఎలా ఉన్నా… వ‌య‌సుకి త‌గిన పాత్ర‌ని ఎంచుకున్నందుకు రవితేజని అభినందించాలి. కాక‌పోతే.. ఇలాంటి పాత్ర‌ల‌తో ఏ విష‌యం క‌న్వే అవ్వ‌బోతోందన్న ఊహ‌.. రవితేజకి ఈ స్క్రిప్టు వినేట‌ప్పుడే వ‌చ్చి ఉంటే బాగుండేది.గతంలో కామెడీ సినిమాలు చేసిన వేణు తొట్టింపూడి గ్యాప్ తర్వాత కనపడ్డారు కానీ ఆయనకు తగిన పాత్ర కాదు. నాసర్ ,రాహుల్ రామకృష్ణ, నరేష్, పవిత్రా లోకేష్, తణికెళ్ల ,పృధ్వీ అందరూ అలా అలా ఆ పాత్రల్లో కనపడి వెళ్లిపోతారు.

హైలెట్స్
అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు

సంభందం సబ్ ప్లాట్స్
డైలాగులు
కథనానికి అడ్చొచ్చే పాటలు ,ఫైట్స్

చూడచ్చా

కష్టమే అని చెప్పాలి… ఓ వీకెండ్ ఇలాంటి నాశిరకమైన సినిమాపై పెట్టుబడి పెట్టడం భావ్యం కాదు

బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
Run Time: 2 hr 26 నిముషాలు
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేదీ: జూలై 29, 2022