రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

Published On: March 29, 2022   |   Posted By:

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‏లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగాయి.

రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వందలాది రామ్ చరణ్ అభిమానులు పాల్గొని కేరింతలు కొట్టారు.

రెండేళ్ల పాటు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటంతో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

ముందుగా రామ్ చరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లను అభిమానులు ఆస్వాదించారు. ఇక ఆ తర్వాత బ్లడ్ డోనర్స్ ను, బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్స్ ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాధవి, చిరంజీవి స్నేహితుడు శేఖర్ లు సత్కరించారు.

అలాగే రామ్ చరణ్ జన్మదిన కానుకగా ఒక స్పెషల్ సాంగ్ చేసిన చక్రి సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారికి, రామ్ చరణ్ జన్మదిన కానుకగా అర ఎకరంలో వరి నాటుతో చరణ్ ముఖ చిత్రాన్ని తయారు చేయించిన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన జయరాజ్ కు, రామ్ చరణ్ ట్రోపీ 2021 నిర్వహించి మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో అనేక కార్యక్రమాలు చేపట్టిన ధనుంజయ్ గార్లను దర్శకుడు మెహర్ రమేష్ చేతుల మీదుగా సత్కరించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి  మాట్లాడుతూ అభిమానుల అండదండలు భగవంతుని దయ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వారందరికీ నా ధన్యవాదాలు. రక్తదానం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆమె ఈ రక్తదానం మీద అవగాహన రావడానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. 24 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చిన ఆలోచ కి మీ అందరూ అండగా నిలబడి ఈ రోజు ఇంత మంది ప్రాణాలు కాపాడుతున్నారని ఆమె కొనియాడారు. ప్రాణాలు నిలబెట్టేది రక్తం అయితే మా హీరోల లైఫ్ లైన్ మాత్రం  అభిమానులు అని చిరంజీవి గారు అంటూ ఉంటారు అని మాధవి చెప్పుకొచ్చారు. చరణ్ ఇంట్లో చాలా సైలెంట్ గా ఉంటాడు అని అన్ని బాధ్యతలు తీసుకుంటాడు అని ఆమె చెప్పుకొచ్చారు. అన్నయ్య మా తోబుట్టువులను ఎలా చూసుకుంటారో చరణ్ కూడా తన తోబుట్టువులను అలాగే చూసుకుంటాడు అని ఆమె అన్నారు. కేవలం పొట్టు లే కాదు కజిన్స్ అంటే మా పిల్లలను కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని అన్నారు. అన్నయ్య తర్వాత మాకు ఏం పర్లేదు చరణ్ బాబు ఉన్నారనే ధైర్యం కల్పించారని అలాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం అని అన్నారు. చరణ్ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని కానీ మా వరకు ఆ విషయాన్ని కూడా రానివ్వరు అని ఆమె చెప్పుకొచ్చారు..

ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు కడప జిల్లా పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వరకు సుమారు 400 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన మధు అనే అభిమానిని వరుణ్ తేజ్ అభినందించారు.

అలాగే అతి తక్కువ సమయంలో రామ్ చరణ్ నటించిన 15 సినిమాలకు సంబంధించిన చిత్రాలను అతి తక్కువ సమయంలో గీసి ప్రదర్శించిన డాక్టర్ హర్షను కూడా వరుణ్ తేజ్ అభినందించారు.

ప్రముఖ సంఘ సేవకులు 76 సార్లు రక్తదానం చేసి, కరోనా సమయంలో సీసీసీ ద్వారా చిరంజీవి గారి తరుపున సినీ కార్మికులకు సరుకులు చెరవేయడంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీను బాబు గారిని వరుణ్ తేజ్ సత్కరించారు.

ఆ తర్వాత వరుణ్ తేజ్ చేతుల మీదుగా సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది.

అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ ” ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా అన్నయ్య రామ్ చరణ్ అభిమానులందరికీ చిరంజీవి గారి అభిమానులందరికీ కళ్యాణ్ గారి అభిమానులందరికీ, మా అన్నయ్య పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు వచ్చిన మెహర్ రమేష్ గారికి, బాబీ గారికి జానీ మాస్టర్ అందరికీ ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు. చరణ్ అన్న పుట్టినరోజు అంటే మా అందరికీ ఒక చిన్న పండుగ లాంటిది, కానీ ఈసారి అది RRR రూపంలో రెండు రోజులు ముందే వచ్చింది. ముందుగా RRR లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించి రామ్ చరణ్ గారికి రామ్ సీతారామరాజు పాత్ర ఇచ్చిన రాజమౌళి గారికి, కొమురంభీం పాత్రలో నటించి రామ్ చరణ్ గారితో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చిన తారాజ్ గారికి కూడా ధన్యవాదాలు. అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా చిన్న వయసులో రామ్ చరణ్ అన్నయ్య అంటే నాకు భయం ఉండేదని సరదాగా ఎప్పుడు ఆటపట్టిస్తూ ఉండేవాడని ఆయన అన్నారు. ఎప్పుడైతే చిరుత సినిమాతో హీరోగా మీ ముందుకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు అని ఆయనలో ఒక స్థాయి మెచ్యూరిటీ నేను చూశాను అని చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు లో ఉన్న మెచ్యూరిటీ, పవన్ కళ్యాణ్ గారి లో ఉన్న నిజాయితీ ముక్కుసూటితనం కలగలిపి రామ్ చరణ్ గారికి వచ్చాయి అని చెప్పుకొచ్చారు. చాలా చోట్ల మంచి నటులు ఉంటారు కానీ రామ్ చరణ్ దారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం నేను ఇంకా ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. అలాంటి అన్నకు తాను తమ్ముడిని అవడం తన అదృష్టం అని ఆయన అన్నారు. మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు ఉన్న ఇలా ముందుకు వచ్చి ఒక పండుగలా  చేస్తున్న మీ అందరికీ థాంక్స్ అని ఆయన అన్నారు ఇది నా తరపున మాత్రమే కాదు రామ్ చరణ్ గారి తరపున కూడా చెబుతున్నాను అని చెప్పుకొచ్చారు. మీ ప్రేమ మామీద ఎప్పుడూ ఇలాగే కురిపిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. చరణ్ అన్న ప్రతి పుట్టిన రోజుకి మేము మీకు గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మీరు ఈసారి RRR లాంటి అద్భుతమైన సినిమాతో గిఫ్ట్ ఇచ్చారని అన్నారు. సినిమాలు చూస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు ఎక్కడా కనిపించలేదని కేవలం అల్లూరి సీతారామరాజు గారి పాత్ర మాత్రమే కనిపించిందని ఆయన సినిమాలో ఒదిగిపోయారు అని చెప్పుకొచ్చారు. కేవలం తెలుగు మాత్రమే కాదు ప్రపంచ స్థాయికి చరణ్ ఎదగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. రామ్ చరణ్ మీద ఎవరైనా మాట్లాడాలి అంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను ముందు మనతో మాట్లాడి ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాలని ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకులు మెహర్ రమేష్, బాబీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జబర్దస్త్ టీమ్ నుంచి హాజరైన అది, దొరబాబు, గడ్డం నవీన్, సద్దాం వంటి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది.

అనంతరం మెహర్ రమేష్ మాట్లాడుతూ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆయన RRR సినిమాతో హిట్ కొట్టడంతో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో మేము అంతే ఆనందంగా ఉన్నామని ఫ్యాన్స్ ని ఉద్దేశించి పేర్కొన్నారు. రామ్ చరణ్ లో ఉన్న సంస్కారం గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెబుతాను అని చెబుతూ ఖైదీ నెంబర్ 150 సినిమా చేసిన తర్వాత అది అద్భుతమైన విజయం సాధించిందని బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఆయనని వెనక్కి తీసుకుని రావాలి అన సంకల్పించిన రామ్ చరణ్ ఆ బాధ్యతలు వినాయక్ కి అప్పగించారు అని ఆ బాధ్యతలు సక్రమంగా పూర్తి చేసిన కారణంగా ఆయనను పిలిచి సన్మానం చేశారని ఆయన అన్నారు. తెలుగులో ఒక స్పెషల్ నోట్ రాయాలని తనకు ఫోన్ చేసి అడిగారు అని వెంటనే వెళితే తన చేత స్పెషల్ నోట్ రాయించి అది వినాయక్ గారికి ఇచ్చి అప్పుడు సన్మానం చేసి పంపించారు అని ఇలాంటి సంస్కారం పుట్టుకతోనే వస్తుందని ఒక స్టార్ అయిన తర్వాత లేదంటే మరి ఇతర కారణాలతోనో ఈ సంస్కారం రాదు అని అలాంటి సంస్కారం ఉన్న రామ్ చరణ్ మరిన్ని విజయాలు అందుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఆ తర్వాత దర్శకుడు బాబీ మాట్లాడుతూ రాంచరణ్ పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు అలాగే రామ్ చరణ్ గురించి మొన్నీ మధ్య తన స్నేహితులతో మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తించామని అదేమిటి అంటే ప్రపంచంలో ఏ మెగాస్టార్ కొడుకు కూడా మరో మెగాస్టార్ గా ఎదగలేదు అని కేవలం చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ మాత్రమే అలా ఒక మెగాస్టార్ స్థాయికి చేరుకున్నాడని తన బాబాయ్ పవర్ స్టార్ స్థాయికి దగ్గరగా వచ్చాడు అని చెప్పుకొచ్చారు. ఇక అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పటి విషయం అని చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఏడాదిన్నర జర్నీ చేశానని సినిమా షూటింగ్ కోసం గుజరాత్ లాంటి ప్రాంతాలకు వెళ్లి 20- 25 రోజులు గడపాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంటి మీద బెంగ అనిపిస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ కి ఫోన్ చేసే వాళ్లని ఆయన వెంటనే వచ్చి వాలిపోయా వారని అన్నారు.. ఆయన ఒక పది రోజుల పాటు ఉండి వెళ్లేవారని అలా వెళ్లిన వెంటనే మళ్లీ పవన్ కళ్యాణ్ గారికి బెంగ అనిపించేదని చరణ్ బాబు అంటే పవన్ కళ్యాణ్ కి అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి విలక్షణ నటుడిని మనకు అందించినందుకు చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని బాబు చెప్పుకొచ్చారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానులు తరఫున ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు. తన జీవితంలో రామ్ చరణ్ ఎంత ముఖ్యమో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెబుతూనే ఆయన తనకు అందించిన జీవితాన్ని సార్థకం చేసుకునే విధంగా శంకర్ గారి సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నానని అది మీరు ఎంత ఊహించుకున్నా దానికి డబుల్ త్రిబుల్ గానే ఉంటుంది అని ఆయన అంచనాలు పెంచేశారు. అరబిక్ కుత్తు సాంగ్ కంటే ఇంకా అదిరిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.

తర్వాత జబర్దస్త్ టీమ్ నుంచి హాజరైన వారు  కూడా రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లడించారు.