అలియాస్ రుక్మిణి  చిత్రం హీరో నితిన్ లుక్ విడుదల

అలియాస్ రుక్మిణి సినిమా నుంచి హీరో నితిన్ లుక్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన కొత్త ప్రమోషనల్ వీడియోలో నితిన్‌ను కృష్ణగా సరికొత్త అవతార్‌లో పరిచయం చేశారు. రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ జీవితం ఎలా ఉండేది? అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా చూపించారు. యంగ్ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు.

దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్, రుక్మిణి పాత్రలో నటిస్తున్న ఆఫియా సయ్యద్‌తో యువకుడైన కృష్ణ గురించి మాట్లాడుతున్న సన్నివేశంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ సంభాషణలోకి నితిన్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్‌లో ఎంట్రీ ఆకట్టుకుంది. ఈ లుక్‌లో నితిన్ దాదాపు పదేళ్లు చిన్నవాడిగా కనిపిస్తున్నారు. పాత్ర వయసుకు తగ్గ అమాయకత్వం, స్వేచ్ఛగా ఉండే స్వభావాన్ని ఆయన లుక్ చక్కగా కనిపిస్తోంది. కృష్ణ పాత్రలో నితిన్ చేసిన ఈ సరికొత్త మేకోవర్ ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. నితిన్‌ను ఇంత యంగ్ లుక్‌లో చూసి ఆఫియా సయ్యద్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఫ్రెష్ లుక్, సన్నని మీసంతో నితిన్ ఈ పోస్టర్‌లో యంగ్ కృష్ణగా ఆకట్టుకుంటున్నారు. మస్టర్డ్ ఎల్లో క్యాజువల్ టీషర్ట్ ధరించి, డెస్క్ దగ్గర కూర్చుని చేతిలో పెన్ను పట్టుకుని ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆయన అమాయకమైన ఎక్స్‌ప్రెషన్స్, సింపుల్ స్టైలింగ్, సహజమైన బాడీ లాంగ్వేజ్ పాత్రకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.

నితిన్, ఆఫియా సయ్యద్ జోడీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. వీరిద్దరి పాత్రలు కథకు ప్రత్యేకమైన రొమాంటిక్ ఫ్లేవర్‌ను అందించనున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

నితిన్‌ను ఎంతో యంగ్ లుక్‌లో చూపించిన ఈ తాజా వీడియోతో ‘అలియాస్ రుక్మిణి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యునానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
పీఆర్వో: వంశీ-శేఖర్