డైలాగ్ కింగ్ సాయికుమార్ బర్త్‌డే స్పెషల్
తెలుగు ప్రేక్షకులకు సాయికుమార్ అనే పేరు పరిచయం అవసరం లేదు. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గంభీరమైన గాత్రం, స్పష్టమైన ఉచ్చారణ, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ. ఎన్నో మంది హీరోలకు తన స్వరంతో ప్రాణం పోసిన ఆయన, అదే గళంతో నటుడిగానూ తిరుగులేని గుర్తింపు సంపాదించారు. అందుకే తెలుగు చిత్రసీమ ఆయనను ప్రేమగా 'డైలాగ్ కింగ్' అని పిలుస్తుంది.
1961 జూలై 27న జన్మించిన సాయికుమార్, ప్రముఖ నటుడు పి.జె. శర్మ కుమారుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన ప్రతిభతోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసి అరుదైన మైలురాయిని అందుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో హీరోలు, ముఖ్య పాత్రలకు తన గళాన్ని అందించారు. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం 'సంసారం'. అనంతరం బాలనటుడిగా 'దేవుడు చేసిన పెళ్లి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా మాత్రం కన్నడలో వచ్చిన 'పోలీస్ స్టోరీ'తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సాయికుమార్‌కు అపారమైన క్రేజ్ వచ్చింది.
తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన నటనా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు. శక్తివంతమైన పోలీస్ పాత్రలైనా, భావోద్వేగభరితమైన తండ్రి పాత్రలైనా, ప్రతినాయకుడి పాత్రలైనా ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రస్తుతం సాయికుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. రవితేజ 'ఇరుముడి', 'ధర్మస్థల నియోజకవర్గం', 'సంబరాల ఏటిగట్టు', నాగార్జున 100వ చిత్రం, ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్', కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం, రోషన్ మేక 'ఏమో ఏమో ఇది', విశ్వక్ సేన్ చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ 'లుంగీ మ్యాన్', నితిన్-నాని ప్రాజెక్ట్, సత్యదేవ్ 'ఫుల్ బాటిల్', వరుణ్ తేజ్ 'బరి', వరలక్ష్మీ శరత్‌కుమార్ 'కూర్మావతారం', సాయి ప్రకాష్ తెరకెక్కిస్తున్న 'సాయి బాబా' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అశ్విన్ బాబు 'వచ్చినవాడు గౌతమ్' చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్, ఆది సాయికుమార్ **'ఎస్‌ఐ యుగంధర్'**లో కామియో రోల్‌లో కనిపించనున్నారు.
అంతేకాదు, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మూడు లాంతర్లు', 'కన్యాశుల్కం' వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. కన్నడలో శివరాజ్‌కుమార్ 'బైల్', నిరూప్ బండారి 'సత్య: సన్ ఆఫ్ హరిశ్చంద్ర', కిచ్చా సుదీప్ 'బిల్లా రంగా భాషా' చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేస్తున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రతి దశలోనూ తనదైన ముద్ర వేసిన సాయికుమార్ తెలుగు సినీ పరిశ్రమకు ఓ విలువైన ఆస్తి. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు!