గరివిడి లక్ష్మి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్

"గరివిడి లక్ష్మి" సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన అడివి శేష్ 

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి ఈ వేడుకకు హాజరయ్యారు. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ .. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలో చేసిన కళా ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ ఆ పాటలు వింటుంటే నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది. నేను వైజాగ్‌లోనే పెరిగాను. గరివిడి లక్ష్మి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న కృతి ప్రసాద్ గారికి, విశ్వ గారికి ధన్యవాదాలు. డైరెక్టర్ గారు చాలా నిజాయితీగా ఈ కథను చెప్పారు. ఆ నిజాయితీని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆనంది గారితో కలిసి నటించాలని అనిపించింది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలో కలిసిపోయాను. ఈ సినిమాకు తప్పకుండా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని నమ్ముతున్నాను. అక్టోబర్ 17న తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. కృతి ప్రసాద్ ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో తీశారు. ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న తనకు అభినందనలు. ‘మహానటి’లో కీర్తి సురేష్ గారికి సావిత్రి గారి పాత్రను ఎలా అయితే ఇచ్చారో, అలాగే ఆనందికి కూడా గరివిడి లక్ష్మి అంత మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ గారు చాలా నిజాయితీగా ఈ సినిమా తీశారు. ట్రైలర్ చూస్తుంటే తన ఫస్ట్ సినిమా లాగా అనిపించడం లేదు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కూడా చాలా మంచి పేరు వస్తుంది. అక్టోబర్ 17న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఆనందిని ‘బస్ స్టాప్’ సినిమాకు హీరోయిన్‌గా పరిచయం చేశాను. దాని తర్వాత తమిళ్‌లో దాదాపు 40 సినిమాలు చేసింది. తన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా టచింగ్‌గా ఉంది. ఇలాంటి పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఎంతో బలంగా నమ్మి తీస్తే ఎంత నిజాయితీగా వస్తుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కృతి ప్రసాద్ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పనిచేసింది. ఇందులో పాటలన్నీ కూడా మనకు తెలిసినవే. అందులో పాటలు, సీన్స్ చూస్తుంటే చాలా నాస్టాల్జిక్ ఫీలింగ్ ఉంది. ఇందులో కళ్యాణ్ గారు పాడిన పాట కూడా వచ్చింది. ప్రతి ఒక్క సినిమా అభిమానీ ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది.  

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను విశ్వ గారు చాలా ప్యాషనేట్‌గా చేశారు. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి ఒక మంచి కథను ప్రపంచానికి చెప్పాలనుకోవడం నిజంగా హ్యాట్సాఫ్. ఆయనకు అభినందనలు. కృతి చాలా చిన్న వయసులో చాలా పెద్ద గౌరవం వచ్చే సినిమా చేస్తుంది. ఇది అందరికీ గౌరవం తెచ్చే సినిమా అవుతుంది. గౌరీ నాయుడు చాలా అద్భుతంగా సినిమా తీశాడు. ఆనంది అద్భుతమైన నటి. ట్రైలర్‌లో తన పెర్ఫార్మెన్స్ టచ్ చేసింది. రేపొద్దున ఆడియన్స్ కూడా ఇదే మాట అంటారని నా నమ్మకం. ఉత్తరాంధ్ర భాషకు, పాటకు ఎంతో గౌరవం తీసుకొచ్చిన గరివిడి లక్ష్మి సినిమాకు మ్యూజిక్ అందిస్తుంది తెలంగాణ అబ్బాయి చరణ్ అర్జున్. మ్యూజిక్ కు భాషా పరిమితులు అనేవి ఉండవు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి, మంచి డబ్బులు చేసి, ఇలాంటి సినిమాలు మరెన్నో తీసే స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను మీరందరూ ఆదరించండి. మన అందరి హార్ట్ టచ్ చేసే సినిమా ఇది. అక్టోబర్ 17న అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘గరివిడి లక్ష్మి’ మాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఇది మన రూట్ కల్చర్‌లో ఉన్న కథ. ఈ జర్నీని మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. ఆనంది తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన పెర్ఫార్మెన్స్‌ను నేను చాలా ఎంజాయ్ చేశాను. నరేష్ గారితో పని చేయడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఆయన చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అక్టోబర్ 17న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. గరివిడి లక్ష్మి నాకు దేవుడిచ్చిన వరం. మా డైరెక్టర్ గౌరీ గారికి థాంక్యూ. ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ చాలా నిజాయితీగా తీసుకున్నారు. ఆయన ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. కచ్చితంగా ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. కృతి ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో తీసింది. తను లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. అలాగే విశ్వ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి తప్పకుండా ఈ సినిమాకు రావాల్సిన పేరు వస్తుంది. నరేష్ గారు ఎప్పుడూ కూడా మా సినిమాను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయన మాటలతో కచ్చితంగా ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుంది. అందరూ చాలా సిన్సియర్‌గా పనిచేశారు. అక్టోబర్ 17న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను.

టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా అమ్మాయి అమెరికాలో పుట్టింది. అక్కడే పెరిగింది. ‘పాడుతా తీయగా’ అమెరికాలో చేసినప్పుడు లైన్ ప్రొడ్యూసర్‌గా చేసింది. తర్వాత యూకేలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివింది. నాకు మా అమ్మాయి మెంటర్. మేము వరుసగా సినిమాలు చేస్తున్నాం. తను కూడా మాతో జాయిన్ అవుతుంది అనుకున్నాము. కాకపోతే తను మాత్రం తానే స్వయంగా సినిమాలు చేస్తానని చెప్పింది. యాక్టర్స్‌ను కూడా నేనే తెచ్చుకుంటాను అని చెప్పింది. ఒక మూడు కథలను ఎంపిక చేసుకుంది. అందులో ‘గరివిడి లక్ష్మి’ ఒకటి. గరివిడి లక్ష్మి పాటలు మనందరికీ తెలుసు. అలాంటి ఒక సినిమాను తీసుకోవడం బాగుంటుందనిపించింది. గరివిడి లక్ష్మి పాత్రకు ఆనందిని ఎంపిక చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. నిజంగా ఈ సినిమాను కృతి చాలా ఫోకస్‌తో చేసింది. నిర్మాతగా 100% క్రెడిట్ తనదే. ఇప్పుడు సినిమా నిర్మాణంలో సరైన అడుగులు వేస్తున్నాము. మా వైపు నుంచి అన్నీ మంచి సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అది ‘గరివిడి లక్ష్మి’తో మొదలు కాబోతుంది. కృతి విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.

నరేష్ వీకే మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్. ఆయన ‘గరివిడి లక్ష్మి’ సినిమాకు మూలస్తంభం అయితే, కృతి ప్రసాద్ గారు ధ్వజస్తంభం. కృతి ప్రసాద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. కచ్చితంగా ఈ సినిమా వాళ్లకు చాలా గొప్ప పేరు తీసుకొస్తుంది. గౌరీ నాయుడు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. తను ఈ సినిమాకు సోల్. నేను ఏ సినిమా అయినా సరే ప్రాజెక్ట్ కోసమే చేస్తాను. ప్రాజెక్ట్ ముందుకు వెళ్తే అందరూ ముందుకు వెళ్దాం. ఈ దసరాకు కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇది అవార్డులు, రివార్డులు వస్తాయి. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా చేసింది. ఇందులో నటించిన ప్రతి నటుడు కూడా అద్భుతంగా నటించారు.

డైరెక్టర్ గౌరీ నాయుడు మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారు నన్ను చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాను నాతో ఒక శిల్పంలాగా చెక్కించారు. కచ్చితంగా ఈ ‘గరివిడి లక్ష్మి’ సినిమా విశ్వ ప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి గొప్ప పేరు తీసుకొస్తుంది. నరేష్ గారి క్యారెక్టర్‌ను మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆనంది గారు ఈ పాత్రను చాలా అద్భుతంగా చేశారు. ఆవిడ స్టేజి ఎక్కితే నాకు పూనకం వచ్చేసేది. ఈ సినిమా తను ఆడిస్తుంది, పాడిస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది. రాగ్ మయూర్ గారు కూడా చాలా అద్భుతమైన హార్డ్ వర్క్ చేసి క్యారెక్టర్ చేశారు. చాలా మంచి స్వింగ్ ఉన్న క్యారెక్టర్. చరణ్ అర్జున్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ మురిసిపోతారు. మా గరివిడి లక్ష్మి మీతో పాడిస్తుంది, ఆడిస్తుంది, కవ్విస్తుంది, నవ్విస్తుంద కన్నీళ్లు పెట్టింది. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నాను. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది.

రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఇది నాకు మోస్ట్ చాలెంజింగ్ ప్రాజెక్ట్. ఇది చాలా స్పెషల్ రోల్. అది మీరు థియేటర్లో చూసి తెలుస్తుంది. నాకు సత్తిబాబు క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్‌కు థాంక్యూ. సినిమా చేయడం మామూలుగా అనిపించలేదు. మొత్తం నైట్ షూట్. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇది నాకు ఈ జర్నీ నేను మర్చిపోలేను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నన్ను నిలబడేలా చేసిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఇలాంటి సినిమా ఇచ్చిన మన నిర్మాతలకు, దర్శకులకు ధన్యవాదాలు. సినిమాకు 20 పాటలు చేశాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చేశాను. ఈ కథ చదివినప్పుడు అద్భుతమైన అనుభూతి చెందాను. సినిమా చూసిన తర్వాత కూడా అదే భావోద్వేగాన్ని పొందాను. ‘శంకరాభరణం’ సినిమాను మాస్ ఆడియన్స్ విజల్స్ వేసి చూస్తే ఎలా ఉంటుందో ‘గరివిడి లక్ష్మి’ అలాంటి సినిమా అవుతుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.