మహేంద్రగిరి వారాహి మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్

మహేంద్రగిరి వారాహి’ మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయి : హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్  చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకురానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. 'మహేంద్రగిరి వారాహి' జర్నీ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైంది. సంతోష్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఒక మంచి నిర్మాత కోసం ఎదురు చూశాం. మధు గారు, లక్ష్మణ్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి, చాలా గొప్పగా తీర్చిదిద్దారు. టీజర్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్ ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్నాం. సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు తప్పకుండా సంతృప్తి చెందుతారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ గారికి, మధు గారికి ధన్యవాదాలు. అలాగే సుమంత్ గారు కూడా నన్ను బలంగా నమ్మారు. మా టెక్నికల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతోంది. టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలోని కంటెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మాపై ఉండాలని కోరుకుంటున్నాను.

నిర్మాత మధు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. టీజర్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ విడుదలైన వెంటనే థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తయింది. దర్శకుడు సంతోష్ గారు తన గాయాన్ని కూడా పక్కనపెట్టి ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశారు. అలాగే సుమంత్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్ ఎంత బాగుందో, ట్రైలర్, పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఊహించని రెండు అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

సీనియర్ నటి మంజు భార్గవి మాట్లాడుతూ: ఇది నాకు చాలా మెమొరబుల్ మూమెంట్. ఎన్నో డివైన్ సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకం. నేను అమ్మవారి భక్తురాలిని. అలాంటి నన్ను ఈ సినిమాలో మంచి పాత్ర కోసం ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.

మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మేమందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. తప్పకుండా మీరు అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

వంశీ చాగంటి మాట్లాడుతూ: సుమంత్ గారి 'గోదావరి' ఆడియో ఫంక్షన్‌కు వచ్చినప్పుడు నన్ను శేఖర్ గారి టీమ్ వెనక్కి పంపించింది.(నవ్వుతూ) తర్వాత నా తొలి సినిమా శేఖర్ గారితోనే చేయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సుమంత్ గారితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 'రంగమార్తాండ' సినిమా సమయంలో నిర్మాతగారితో పరిచయం ఏర్పడింది. మళ్లీ ఆయన నన్ను గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సంతోష్ గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఇది చాలా మంచి సినిమా. మేమంతా చాలా పాజిటివ్‌గా ఉన్నాం. సెప్టెంబర్ 11న విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది.

శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ: అమ్మవారి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మాపై ఉంటాయి. సుమంత్ గారితో ఇది నాకు నాలుగో సినిమా. అలాగే సంతోష్ గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను నటించాను. 'రంగమార్తాండ' వంటి మంచి సినిమా తీసిన మధు గారు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.

ఫైట్ మాస్టర్ అంజి మాట్లాడుతూ: ఇంత మంచి సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత, సుమంత్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫైట్స్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశాం. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

నటీనటులు: సుమంత్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ.

సాంకేతిక బృందం:
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: కలిపు మధు, లక్ష్మణ్
నిర్మాణ సంస్థలు: రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: ప్రతాప్ ఆర్ కృష్ణ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ ఆర్ట్స్
పి.ఆర్.ఓ : వంశీ-శేఖర్